
బేస్తవారిపేట: మార్కాపురం జిల్లా బేస్తవారిపేట మండల కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో అల్లుడు తన భార్య కుటుంబంపై కక్ష పెంచుకొని ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన సత్తాబి పెద్ద కుమారుడు రాజా హుస్సేన్ కుమార్తెను పొదలకుంటపల్లెకు చెందిన వలి అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. అయితే, గత కొంతకాలంగా వలి తన భార్యను వేధిస్తుండటంతో మామ రాజా హుస్సేన్ అతడిని పలుమార్లు హెచ్చరించారు.
దీనిపై కక్ష పెంచుకున్న వలి, ఈ రోజు మధ్యాహ్నం కుటుంబ సభ్యులంతా నిద్రలో ఉన్న సమయంలో ఇంటి వెనుక ద్వారం గుండా లోపలికి ప్రవేశించి, తన బావమరిది అయిన ఖాజావలిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు. అనంతరం అక్కడ నుంచి పారిపోతుండగా ఎదురైన మామ రాజా హుస్సేన్‌పై కూడా దాడి చేసి గాయపరిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
