అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ఇరాన్ తీరుపై నిప్పులు చెరిగారు. రానున్న రెండు మూడు వారాల్లో ఇరాన్‌పై కనీవినీ ఎరుగని రీతిలో అతితీవ్రమైన దాడులు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే ఇరాన్ కీలక నాయకత్వం నాశనమైందని, ఆ దేశ నౌకాదళం (Navy), ఎయిర్ ఫోర్స్ దాదాపు తుడిచిపెట్టుకుపోయాయని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ క్షిపణులు మరియు డ్రోన్లు ప్రయోగించే సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయిందని, ఒకవేళ ఇరాన్ సరైన ఒప్పందానికి రాకపోతే ఆ దేశాన్ని రాతియుగానికి నెట్టేస్తానని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. అంతేకాకుండా, ఇరాన్ ఆర్థిక మూలమైన చమురు కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేస్తామని, ఆ దేశం తన మొండి వైఖరి వీడకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధిని (Strait of Hormuz) తిరిగి తెరిచే వరకు కాల్పుల విరమణ ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
