
ఆసియా ఖండంలోనే అతిపెద్ద (cumbum cheruvu )మానవ నిర్మిత కట్టడంగా, సాక్షాత్తు శ్రీకృష్ణదేవరాయల పాలన నాటి అద్భుత చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన మార్కాపురం జిల్లా ‘కంభం చెరువు’ నేడు పాలకుల అసమర్థతకు, అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలుస్తోంది. తరతరాలుగా, ఎన్నికల వేళ ప్రతి నాయకుడు నోరు తెరిస్తే చాలు “కంభం చెరువును టూరిస్ట్ హబ్‌గా మారుస్తాం, కోట్లు కుమ్మరిస్తాం” అని చెప్పే కబుర్లు కోటలు దాటుతున్నాయి కానీ, క్షేత్రస్థాయిలో ఒక్క ఇటుక కూడా కదలకపోవడం శోచనీయం. నిధుల విడుదల పేరిట కాలయాపన చేస్తూ, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ అంటూ ఫైళ్లను అటకెక్కించి, పర్యాటక-నీటిపారుదల శాఖల మధ్య సమన్వయం లేక ఈ చారిత్రక సంపదను గాలికి వదిలేశారు. అభివృద్ధి మాట దేవుడెరుగు.. కనీసం ఆ పవిత్ర కట్టడంపై రక్షణ కూడా కరువై, నేడు అది మందుబాబుల అడ్డాగా, అసాంఘిక కార్యకలాపాల నిలయంగా మారిపోతుంటే చూస్తూ ఊరుకోవడం మీ చేతకానితనం కాదా? మీ రాజకీయ సంకల్పం కేవలం ఓట్ల కోసమేనా లేక మార్కాపురం జిల్లా ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసమా? ఇప్పటికైనా ప్రచార ఆర్భాటాలు ఆపి, ప్రకటించిన బడ్జెట్‌ను తక్షణమే విడుదల చేసి పనులు మొదలుపెట్టండి.. లేదంటే చరిత్ర గల కంభం చెరువును నిర్వీర్యం చేసిన పాలకుల జాబితాలో మీ పేర్లు కూడా మిగిలిపోతాయని గ్రహించండి!
