
మహారాష్ట్రలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. గడిచిన రెండేళ్ల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన సుమారు 93,000 మంది మహిళలు కనిపించకుండా పోయారని దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా వెల్లడించిన గణాంకాలు దేశవ్యాప్తంగా (Maharastra missing women’s case ) చర్చనీయాంశమవుతున్నాయి. ఈ నివేదిక ప్రకారం, రాష్ట్రంలో ప్రతిరోజూ సగటున 129 మంది మహిళలు అదృశ్యమవుతున్నారు. వీటిలో దాదాపు 72 శాతం కేసుల్లో మహిళలను పోలీసులు తిరిగి గుర్తించగలుగుతున్నప్పటికీ, మిగిలిన వారి ఆచూకీ లభ్యం కాకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా ప్రేమ వ్యవహారాలు, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు మరియు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లడం వంటివి ఈ అదృశ్యాలకు ప్రధాన కారణాలుగా అధికారులు పేర్కొంటున్నారు. అయితే, ఈ మిస్సింగ్ కేసుల వెనుక హ్యూమన్ ట్రాఫికింగ్ (మానవ అక్రమ రవాణా) ముఠాల హస్తం ఉందా అనే కోణంలో కూడా లోతైన విచారణ జరపాలని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఇంతటి భారీ స్థాయిలో మహిళలు అదృశ్యం కావడం సామాజిక భద్రతపై పెను సవాలుగా మారింది.
