
గిద్దలూరు: స్థానిక ఆర్టీసీ డిపోలో పార్కింగ్ పేరుతో జరుగుతున్న అక్రమ వసూళ్లు సామాన్య ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా కార్గో సేవల కోసం వచ్చే వాహనదారులను అక్కడి సిబ్బంది టార్గెట్ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పార్సిల్ తీసుకోవడానికైనా లేదా ఇవ్వడానికైనా వచ్చి, కేవలం ఐదు నిమిషాల పాటు ద్విచక్ర వాహనం నిలిపినా కూడా నిర్బంధంగా ₹100 వసూలు చేస్తుండటం గమనార్హం. ఇతర ప్రాంతాల్లో లేని విధంగా గిద్దలూరు డిపోలోనే ఈ అడ్డగోలు చార్జీలు వసూలు చేయడంపై స్థానికులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ దోపిడీపై ఇప్పటికే పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా, వారు పట్టించుకోకపోవడంతో సిబ్బంది ఆగడాలు మితిమీరిపోతున్నాయని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, ఈ అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట వేసి సామాన్యులకు ఊరట కలిగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
